మోదీ నినాదాలతో మార్మోగిన పాక్ పార్లమెంటు... అసహనంతో నిష్క్రమించిన విదేశాంగ మంత్రి

29-10-2020 Thu 14:55
  • బలూచిస్థాన్ ఉద్యమంపై విదేశాంగ మంత్రి ప్రసంగం
  • పదేపదే అడ్డుతగిలిన బలూచిస్థాన్ ఎంపీలు
  • మోదీని వేనోళ్ల పొగిడిన ఎంపీలు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రి
Modi chants in Pakistan parliament as foreign minister Shah Muhammad Qureshi quits in the middle of his speech

పాకిస్థాన్ పార్లమెంటులో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. బలూచిస్థాన్ ఉద్యమం గురించి పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ సభలో ప్రసంగిస్తుండగా, బలూచిస్థాన్ ఎంపీలు అడ్డుతగిలారు. వారు సభాముఖంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని వేనోళ్ల పొగుడుతూ పాక్ విదేశాంగ మంత్రిని తీవ్ర అసహనానికి గురిచేశారు. ఆ ఎంపీలు ఎంతకీ తగ్గకుండా మోదీ, మోదీ అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో ఖురేషీ ఉడికిపోయారు.

బలూచిస్థాన్ ఎంపీల మనసుల్లోకి మోదీ భావనలు చొరబడినట్టున్నాయని, భారత అజెండాను విపక్ష సభ్యులు పాక్ లో అమ్ముతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత అనుకూల నినాదాలతో జాతీయ సంస్థలను అవమానానికి గురిచేస్తున్నారని విమర్శించారు. విపక్ష సభ్యుల నియోజకవర్గాల నుంచి బలూచిస్థాన్ స్వాతంత్ర్యం కోసం నినాదాలు రావడం సిగ్గుచేటు అని అన్నారు. అయినప్పటికీ బలూచిస్థాన్ ఎంపీలు ఖురేషీకి పదేపదే అడ్డుతగిలారు. దాంతో ఖురేషి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు.

అంతకుముందు, పాకిస్థాన్ పార్లమెంటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వైఖరిని ఖండిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఓ తీర్మానం ఆమోదించింది. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా చార్లీ హెబ్డో పత్రికలో వ్యంగ్య చిత్రణ చోటుచేసుకోవడాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఖండించకపోవడాన్ని నిరసిస్తూ పాక్ పార్లమెంటులో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ప్రసంగిస్తూ, మధ్యలో బలూచిస్థాన్ ప్రస్తావన తీసుకువచ్చారు. దాంతో బలూచిస్థాన్ ప్రాంత ఎంపీలు రెచ్చిపోయి మంత్రి ప్రసంగాన్ని రసాభాస చేశారు.