నాగబాబు ప్లాస్మాదానం చేస్తుండగా సర్ ప్రైజ్ చేసిన చిరంజీవి

29-10-2020 Thu 14:22
  • నేడు నాగబాబు పుట్టినరోజు
  • చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నాగబాబు ప్లాస్మాదానం
  • ముందుగా చెప్పకుండానే ట్రస్టు కార్యాలయానికి విచ్చేసిన చిరంజీవి
Megastar Chiranjeevi surprised his brother Nagababu
మెగాబద్రర్ నాగబాబు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సమాచారం లేకుండా వచ్చేసి తన తమ్ముడ్ని సర్ ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన నాగబాబు తన అన్నయ్య సమక్షంలో పుట్టినరోజు జరుపుకుని మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్టు సిబ్బంది కూడా పాల్గొన్నారు.

కాగా, నాగబాబు తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్లాస్మాదానం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, కరోనా నుంచి కోలుకున్న తాను రెండోసారి ప్లాస్మా దానం చేస్తుండగా అన్నయ్య చిరంజీవి సడెన్ గా వచ్చారని వెల్లడించారు. అయితే, తన అన్నయ్య వస్తున్నట్టు తనతో పాటు ఎవరికీ తెలియదని, తాను వస్తున్నట్టు ముందుగా సమాచారం ఇవ్వకుండానే వచ్చేసి తనను ఎంతో సంతోషానికి గురిచేశాడని వెల్లడించారు.

తానెంతో ఇష్టపడే తన సోదరుడు తన జీవితానికి మార్గదర్శిగా ఉండడం ఎంతో హర్షణీయం అని తెలిపారు. మహాసముద్రం అంతటి ఆయన ప్రయత్నాల్లో తాను ఓ చిన్న బిందువుగా ఉండడం పట్ల గర్విస్తున్నానని వెల్లడించారు.