హీరోయిన్ దీపికా పదుకునే మేనేజర్ ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం

29-10-2020 Thu 13:57
  • రెండు బాటిళ్ల లిక్విడ్ సీఎన్బీ స్వాధీనం
  • విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • కొంత కాలంగా దీపిక, ఆమె మేనేజర్ పై నిఘా
Drugs seized in Deepika Padukune managers house

ఇప్పటికే డ్రగ్స్ అంశంలో బాలీవుడ్ పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ఎన్సీబీ విచారణకు ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, రియా చక్రవర్తి తదితరులు ఉన్నారు. దాదాపు 15 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు విచారణలో బయటపడ్డాయని కొన్ని రోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా బాలీవుడ్ లో మరో కలకలం రేగింది.

దీపికా పదుకునే మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రెండు బాటిళ్ల లిక్విడ్ సీఎన్బీ దొరికినట్టు అధికారులు తెలిపారు. అయితే, తనిఖీలు జరిగిన సమయంలో కరిష్మా లేకపోవడంతో... విచారణకు హాజరుకావాలని ఆమె ఇంటికి అధికారులు నోటీసులు అతికించారు. డ్రగ్స్ విచారణలో వాట్సప్ చాటింగ్ లో డీ, కే అనే పదాలను అధికారులు గుర్తించారు. ఇందులో డీ అంటే దీపికా, కే అంటే కరిష్మాగా అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి వారిపై నిఘా ఉంచిన అధికారులు చివరకు కరిష్మా ఇంట్లోనే డ్రగ్స్ ను గుర్తించారు.