Narendra Modi: మేము ఎవర్నీ మరచిపోం.. దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ను అందిస్తాం: ప్రధాని మోదీ హామీ

  • అందుబాటులోకి రాగానే పంపిణీ 
  • ఇప్పటికే జాతీయ నిపుణుల బృందం ఏర్పాటు
  • రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయుల్లోనూ బృందాలు
  • నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యాక్సిన్ పంపిణీ
modi on vaccine distribution

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే దేశంలోని ప్రజలందరికీ అందిస్తామని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌లో ఏ ఒక్క పౌరుడిని విడిచిపెట్టకుండా కరోనా టీకా అందిస్తామని భరోసా ఇచ్చారు. ఓ జాతీయ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ వ్యాక్సిన్ గురించి మాట్లాడారు. తాము ఎవర్నీ మరచిపోమని హామీ ఇస్తున్నానని, మొదట్లో మాత్రం కొవిడ్ వారియర్స్‌ పైనే సహజంగా దృష్టి సారిస్తామని తెలిపారు.

వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే జాతీయ నిపుణుల బృందం ఏర్పాటైందని, వారు వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళికలను నిర్దేశిస్తారని చెప్పారు. వ్యాక్సిన్ ప్రతి వ్యక్తికి చేరేలా 28 వేలకు పైగా కోల్డ్ చైన్ పాయింట్లును సిద్ధం చేయనున్నామని అన్నారు.  రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయుల్లో ఏర్పాటు చేసిన బృందాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యాక్సిన్ పంపిణీని పర్యవేక్షిస్తాయని వివరించారు.

కాగా, కరోనా  ఎపుడు ఎలా విస్తరిస్తుందో అర్థం కావడం లేదని, ఒకసారి గుజరాత్, మరోసారి కేరళ, కర్ణాటక ఇలా కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తిస్తున్నామని తెలిపారు. అయితే, మళ్లీ కరోనా వ్యాప్తి మరో ప్రాంతంలో ఉద్ధృతంగా మారుతోందని చెప్పారు. దేశ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. కాగా, తాము మరోసారి బీహార్ లో అధికారంలోకి వస్తే అక్కడి ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చిన నేపథ్యంలో దానిపై దేశంలోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాక్సిన్ ను అందరికీ అందిస్తామని ప్రకటించడం గమనార్హం.

More Telugu News