నాగిని పాత్రలో 'సాహో' భామ.. మూడు భాగాలుగా నిర్మాణం!

29-10-2020 Thu 12:36
  • నాగిని పాత్రతో బాలీవుడ్ లో పలు సినిమాలు 
  • శ్రద్ధ కపూర్ తో మూడు భాగాలుగా నిర్మాణం
  • శ్రీదేవి సినిమాలు ఎన్నో చూశానన్న శ్రద్ధ
  • భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో చిత్ర నిర్మాణం  
Shraddha Kapoor to play Nagini role

మన దర్శకులు వెండితెరపై రకరకాల పాత్రలను ఆవిష్కరిస్తూవుంటారు. ప్రేక్షకులను ఆకట్టుకునే వాటిని రిపీట్ చేస్తుంటారు. అలాంటి పాత్రల్లో నాగిని పాత్ర ఒకటి. హిందీలో ఈ నాగిని ఇతివృత్తంతో మొదటి నుంచీ రకరకాల సినిమాలు వచ్చాయి. ఎంతో మంది కథానాయికలు నాగిని పాత్రలు పోషించి మెప్పించారు. అందుకే, నాగిని క్యారెక్టర్ అనేది మన దర్శక నిర్మాతలకు కమర్షియల్ ఎలిమెంట్ కూడా అయిపోయింది.

ఇదే కోవలో తాజాగా 'సాహో' హీరోయిన్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయికగా నాగిని ఇతివృత్తంతో ఓ సినిమా రూపొందనుంది. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకునే నాగినిగా ఇందులో శ్రద్ధ కనిపిస్తుందట. ఇప్పుడీ కథను మూడు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మూడు భాగాల్లోనూ కూడా నాగిని పాత్ర పోషించడానికి శ్రద్ధా కపూర్ తో ఒప్పందం చేసుకున్నారు.

దీని గురించి శ్రద్ధ చెబుతూ, "శ్రీదేవి నటించిన నగీనా, నిగాహెన్ వంటి నాగిని చిత్రాలను చిన్నప్పటి నుంచీ ఎన్నోసార్లు చూస్తూ వచ్చాను. ఇలాంటి పాత్ర వస్తే పోషించాలని కలలు కన్నాను. అది ఇన్నాళ్లకు నిజమవుతున్నందుకు చాలా హ్యాపీగా వుంది" అని చెప్పింది. విజువల్ ఎఫెక్ట్స్ తో నయనానందంకరంగా రూపొందే ఈ చిత్రానికి విశాల్ పురియా దర్శకత్వం వహిస్తుండగా, నిఖిల్ ద్వివేది నిర్మిస్తున్నారు.