Uttarakhand: ఉత్తరాఖండ్ సీఎం రావత్‌ పై అవినీతి ఆరోపణలు.. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం.. సుప్రీంకోర్టుకు సీఎం!

  • బీజేపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న సమయంలో ఓ నియామకానికి డబ్బులు పుచ్చుకున్నారని ఆరోపణ
  • జర్నలిస్టుల పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు
  • విమర్శలు స్వీకరించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందన్న న్యాయస్థానం
Uttarakhand cm rawat moves to supreme court against high court order

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్‌పై వస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2016లో ఝార్ఖండ్ బీజేపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న సమయంలో ఓ నియామకం విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని, రావత్ ఆమోదంతో ఇది జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలంటూ ఇద్దరు జర్నలిస్టులు ఉమేశ్ శర్మ,

శివప్రసాద్‌ సేమ్వాల్‌లు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారిద్దరూ రావత్‌పై పలు ఆరోపణలు చేశారు. బీజేపీ ఝార్ఖండ్ ఇన్‌చార్జ్‌గా ఉన్న సమయంలో ఓ నియామకం విషయంలో ఆయన డబ్బులు పుచ్చుకున్నారంటూ జర్నలిస్ట్ ఉమేశ్ శర్మ ఓ వీడియోలో ఆరోపించారు. ఈ పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు జస్టిస్ రవీంద్ర మైథానీ ఆదేశాలు జారీ చేశారు.

 ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, విమర్శలను స్వీకరించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందన్నారు. రావత్‌పై హైకోర్టు మంగళవారం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగా, ఆ తీర్పును రావత్ నిన్న సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

More Telugu News