బైడెన్ అవినీతిని బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారు: అమెరికన్ మీడియాపై ట్రంప్ రుసరుస

29-10-2020 Thu 08:22
  • బైడెన్ అవినీతి ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాయి
  • ఇలాంటి పక్షపాత వైఖరి చివరికి వారికే నష్టం చేస్తుంది
  • బైడెన్ నుంచి మీడియా సంస్థలు, టెక్ కంపెనీలకు లబ్ధి
Donald Trump fires on American media once again

అమెరికన్ మీడియాపై ట్రంప్ మరోమారు ఫైరయ్యారు. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అవినీతిని అమెరికన్ మీడియా తొక్కిపెడుతోందని మండిపడ్డారు. బైడెన్‌ నుంచి ప్రయోజనాలు పొందిన మీడియా సంస్థలు, బడా టెక్నాలజీ కంపెనీలు ఆయన ప్రాపకం కోసం పాకులాడుతున్నాయని, అందుకనే ఆయనను రక్షించేందుకు ఆరాటపడుతున్నాయని ఆరోపించారు. బైడెన్ అవినీతి గురించి ప్రజలకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాయని విమర్శించారు.

ఇలాంటి పక్షపాత వైఖరి గతంలో ఎప్పుడూ లేదని, ఇప్పుడే తొలిసారి చూస్తున్నామని అన్నారు. చివరికి ఇది వారికే నష్టం చేస్తుందని హెచ్చరించారు. ఈ ఎన్నికలను ప్రభుత్వ సూపర్ ఎకనమిక్ రికవరీకి, బైడెన్ డిప్రెషన్‌కు మధ్య జరుగుతున్న పోటీగా ట్రంప్ అభివర్ణించారు. ఈ రెండింటిలో ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. కాగా, మాస్కో మేయర్‌కు అత్యంత సన్నిహితుడైన బైడెన్‌కు రష్యా నుంచి 3.5 మిలియన్ డాలర్లు అందినట్టు ట్రంప్ ఇటీవల ఆరోపించారు.