Bengaluru: ఓడిన బెంగళూరు.. ప్లే ఆఫ్స్‌లోకి ముంబై

  • కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన బెంగళూరు బ్యాట్స్‌మెన్
  • పడిక్కల్ తప్ప బ్యాట్ ఝళిపించలేకపోయిన స్టార్ ఆటగాళ్లు
  • ముంబైని గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’
Mumbai Confirms play off berth

ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొంది ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. బెంగళూరు నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఓపెనర్లు క్వింటన్ డికాక్ 18, ఇషాన్ కిషన్ 25 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ అజేయంగా 79 పరుగులు చేశాడు. క్రీజులోకి వచ్చిన దగ్గరి నుంచి బంతిని బాదడమే పనిగా పెట్టుకున్న సూర్యకుమార్ 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. సౌరభ్ తివారీ 5, కృనాల్ పాండ్యా 10, హార్దిక్ పాండ్యా 17, కీరన్ పొలార్డ్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ విజయంతో ముంబై ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 11 ఓవర్ల వద్ద జట్టు స్కోరు 90 పరుగులు దాటడంతో బెంగళూరు భారీ స్కోరు చేస్తుందని భావించారు. అయితే, కెప్టెన్ కోహ్లీ (9) అవుటైన తర్వాత పరిస్థితి తారుమారైంది. వికెట్లను వెంటవెంటనే చేజార్చుకుంది. దీనికి తోడు బుమ్రా విజృంభించి మూడు వికెట్లు తీయడంతో జట్టు స్కోరు నెమ్మదించింది.

ఓపెనర్ ఫిలిప్పీ 33 పరుగులు చేయగా, దేవదత్ పడిక్కల్ మరోసారి చెలరేగిపోయాడు. 45 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేశాడు. అతడి తర్వాత మరెవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. డివిలియర్స్ (15) మరోమారు నిరాశపరచగా, దూబే (2), మోరిస్ (4), గురుకీరత్ సింగ్ (14), వాషింగ్టన్ సుందర్ (10) పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నేడు దుబాయ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా మధ్య మ్యాచ్ జరగనుంది.

More Telugu News