Skoch Awards: 48 స్కోచ్‌ గ్రూపు అవార్డులతో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ఏపీ పోలీస్ విభాగం

  • ఈ ఏడాది 85 అవార్డులను సాధించిన ఏపీ
  • టెక్నాలజీ వినియోగంపై మెరిట్ అవార్డులు
  • పోలీస్ శాఖకు శుభాకాంక్షలు తెలిపిన జగన్
AP police achieved 48 Skoch awards

పోలీసు శాఖలో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 84 అవార్డులను ప్రకటించగా రికార్డు స్థాయిలో ఏపీ 48 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఇప్పటికే 37 అవార్డులను కైవసం చేసుకున్న ఏపీ తాజా అవార్డులతో కలిపి మొత్తం 85 అవార్డులు సాధించింది. తద్వారా దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. అద్భుతమైన ప్రతిభను కనపరిచిన పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. టెక్నాలజీ వినియోగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామని, ప్రజలకు త్వరితగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

అవార్డుల విషయానికి వస్తే దిశ, దాని సంబంధిత విభాగాల్లో వినియోగిస్తున్న టెక్నాలజీ సేవలకు 5 అవార్డులు వచ్చాయి. 87 సేవలతో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన పోలీస్ సేవ అప్లికేషన్ కు కూడా అవార్డు వచ్చింది. కరోనా సమయంలో అందించిన సేవలకు 3 అవార్డులు, టెక్నిక్ విభాగంలో 13 అవార్డులు, సీఐడీకి 4, కమ్యూనికేషన్ కు 3 అవార్డులు వచ్చాయి. కర్నూలు, విజయవాడ జిల్లాలకు 3 చొప్పున, కడప, అనంతపురం జిల్లాలకు 2 చొప్పున; చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, కృష్ణా జిల్లాలకు ఒక్కో అవార్డు చొప్పున లభించాయి. పోలీసు శాఖ సాధించిన విజయాల పట్ల డీజీపీ గౌతమ్ సవాంగ్ సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News