హరీశ్ రావు వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయి: విజయశాంతి

28-10-2020 Wed 18:02
  • దుబ్బాక ఫలితాలెలా ఉండాలో ముందో నిర్ణయించినట్టున్నారు
  • కేసీఆర్ ఫాంహౌస్ లో ఓట్లు లెక్కిస్తారేమో
  • హరీశ్ హైరానా ఎందుకో అంతు చిక్కడం లేదు
Harish Rao comments creating doubts says Vijayashanti

దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదన్న మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సందేహం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఎన్నికలకు ముందే ఫలితాలెలా ఉండాలో టీఆర్ఎస్ నిర్ణయించిందనే విషయం అర్థమవుతోందని చెప్పారు. అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు స్పష్టత వచ్చిందని అన్నారు.  హరీశ్ ‌రావు కామెంట్ చూస్తుంటే... దుబ్బాక పోలింగ్ తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌లో ఈవీఎంలు పెట్టి ఓట్లు లెక్కిస్తారేమోనన్న అనుమానం వస్తోందని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మరణంతో జరిగే ఉపఎన్నిక గురించి టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా హరీశ్ రావు హైరానా ఎందుకో ఎవరికీ అంతు చిక్కడంలేదని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉపఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే... దాని ప్రభావం హరీశ్ మంత్రి పదవి మీద పడుతుందని కేసీఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారా? అనే చర్చ కూడా జరుగుతోందని విజయశాంతి చెప్పారు. ఈ కారణం వల్లే ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్ కరోనాను ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే... దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారని ఓటర్లు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.