సిరిమానోత్సవంలో అలక వహించిన సంచయిత

28-10-2020 Wed 15:32
  • కోటపై కూర్చున్న సుధ, ఊర్మిళ
  • వారిని దింపేయాలన్న సంచయిత 
  • ఆ పని చేయలేమన్న పోలీసులు
Sanchita unhappy in Sirimanotsavam
విజయనగరం గజపతిరాజుల ఇంటి పంచాయతీ చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాన్సాస్ అధినేత బాధ్యతల నుంచి టీడీపీ నేత అశోక్ గజపతిరాజును తొలగించి, ఆయన స్థానంలో ఆనందగజపతిరాజు మాజీ భార్య కుమార్తె సంచయితను నియమించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కొంత వివాదం చెలరేగింది. ఈ క్రమంలో తాజాగా పైడితల్లి సిరిమానోత్సవంలో మరో ఘటన చోటు చేసుకుంది.

కార్యక్రమం సందర్భంగా ఆనందగజపతిరాజు రెండో భార్య సుధ, కుమార్తె ఊర్మిళ కోటపై కూర్చున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన సంచయిత అక్కడి నుంచి వారిద్దరినీ దింపేయాలని అక్కడున్న పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఆ పని తాము చేయలేమని పోలీసులు చెప్పడంతో... కోటపై ఏర్పాటు చేసిన వేదికపై మరోవైపు ఉన్న కుర్చీలో ఆమె కూర్చున్నారు. అయితే సంచయిత వ్యవహరించిన తీరుపట్ల సుధ, ఊర్మిళ దీక్షకు సిద్ధపడటంతో అక్కడ పరిస్థితి వేడెక్కింది. ఆనందగజపతిరాజుకు అసలైన వారసురాలిని తానేనని ఈ సందర్భంగా ఊర్మిళ వ్యాఖ్యానించారు.