Kannababu: అది ఎన్నికల కమిషన్ కాదు.. నిమ్మగడ్డ కమిషన్: ఏపీ మంత్రి కన్నబాబు

  • వ్యక్తిగత ఇష్టాల కోసం ఎన్నికల సంఘాన్ని నడుపుతున్నారు
  • వైసీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే ఆయన లక్ష్యం
  • జగన్ కు ఎవరి మీదా వ్యక్తిగత కోపం లేదు
Nimmagadda Ramesh intention is to damage YSRCP govt says Kannababu

రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఏపీ మంత్రి కన్నబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్నది ఎన్నికల కమిషన్ కాదని... నిమ్మగడ్డ కమిషన్ అని విమర్శించారు. వ్యక్తిగత అహం కోసం, ఇష్టాల కోసం ఎన్నికల సంఘాన్ని నిమ్మగడ్డ రమేశ్ నడుపుతున్నారని అన్నారు. ప్రభుత్వంతో చర్చించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను రమేశ్ వాయిదా వేశారని... ఆయనేంటో అప్పుడే జనాలకు అర్థమైందని చెప్పారు. కనీసం ముఖ్యమంత్రికి కూడా చెప్పకుండానే  ఎన్నికలను వాయిదా వేశారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే  ఆయన లక్ష్యమని... అదే ఉద్దేశంతో ఉన్నవారికి ఆయన సహకరిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలనుకుంటున్న పార్టీలతో నిమ్మగడ్డ సమావేశం ఏర్పాటు చేశారని కన్నబాబు విమర్శించారు. ఏపీలో ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం ఉందని విమర్శిస్తూ గతంలో కేంద్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ లేఖ రాశారని చెప్పారు. జగన్ కు వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదని అన్నారు. వ్యవస్థల పనితీరుపైనే ఆయన ఆలోచిస్తున్నారని... ఎన్నికల కమిషన్ ఇలా పని చేయడం కొనసాగిస్తే... భవిష్యత్తులో అది ఆనవాయతీగా మారుతుందని చెప్పారు.

ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చిన తాము ఎలక్షన్లకు ఎందుకు భయపడతామని ప్రశ్నించారు. ఒకవేళ ఎన్నికలను నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేశ్ సిద్ధమైతే... ఉన్నత స్థాయిలో చర్చించి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయినా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుంటే ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.

More Telugu News