బండి సంజయ్‌కు హరీశ్‌రావు మరోసారి సవాల్

28-10-2020 Wed 13:18
  • సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందన్న సంజయ్
  • కేంద్ర నిధులపై చర్చకు తాను సిద్ధమన్న హరీశ్
  • దుబ్బాకకు వస్తారా? లేక కరీంనగర్ కు రమ్మంటారా? అని సవాల్
Harish Rao challenges Bandi Sanjay

టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని విధంగా లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం చేస్తోందని ఆయన అన్నారు. ప్రజల ఆలోచనను తప్పుదారి పట్టించేలా సంజయ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కేంద్రం ఇచ్చే నిధులపై చర్చకు తాను సిద్ధమని... మీరు సిద్ధమా అంటూ బండి సంజయ్ కు హరీశ్ సవాల్ విసిరారు. 'మీరు దుబ్బాకకు వస్తారా? లేక నన్ను కరీంనగర్ కు రమ్మంటారా?' అని ఛాలెంజ్ చేశారు. సిద్ధిపేటలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బీజేపీ నేతలు... జరిగిన దానిపై తప్పుడు ప్రచారానికి తెరతీశారని విమర్శించారు.

మరోవైపు పోలీసుల తీరుకు నిరసనగా కరీంనగర్ లో బండి సంజయ్ నిరాహారదీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆయన శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో... నిన్న పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. మాజీ ఎంపీలు వివేక్, జితేందర్ రెడ్డిలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.