భారత్‌లో కరోనా మహమ్మారిపై పోరును కాలుష్యం అడ్డుకుంటుందా?

28-10-2020 Wed 12:21
  • నవంబరు-ఫిబ్రవరి మధ్య దేశంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశం
  • ఈ కాలంలో ఉత్తర భారతదేశంలో గణనీయంగా క్షీణించనున్న గాలి నాణ్యత
  • కాలుష్య ప్రాంతాల్లో మరణాలు పెరిగే ప్రమాదం
air pollution may stop fight on covid 19

దేశంలో కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరుకు వాయు కాలుష్యం అడ్డంకిగా మారుతుందా? అంటే నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. శీతాకాలమైన నవంబరు నుంచి ఫిబ్రవరి మధ్య వాయు కాలుష్యం కారణంగా కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫలితంగా మరణాలు కూడా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయుకాలుష్యం అధికంగా ఉన్న చోట్ల మరణాలు అధికంగా సంభవించినట్టు పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేయడంతో శాస్త్రవేత్తల్లో ఆందోళన మరింత పెరిగింది.

దీనికి తోడు ఢిల్లీతోపాటు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోతున్నట్టు ఇటీవల నిర్వహించిన హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంది. సెప్టెంబరులో గాలిలో సూక్ష్మ రేణువుల స్థాయి (పీఎం 2.5) ఒక్క మైక్రోగ్రామ్ పెరగడం వల్ల మరణాల రేటు ఏకంగా 8 శాతం పెరిగినట్టు అధ్యయనం వివరించింది. మరోవైపు, వాయుకాలుష్యం అధికంగా ఉన్న ఇంగ్లండ్‌లోని పలు ప్రాంతాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లోనూ ఇంచుమించు ఇలానే జరిగే అవకాశం ఉందని కేంబ్రిడ్జ్ రీసెర్చర్ మార్కో ట్రవాగ్‌లియో పేర్కొన్నారు.

 ఉత్తరభారత దేశంలో ప్రతి ఏడాది నవంబరు-ఫిబ్రవరి మధ్య పంట వ్యర్థాల దహనం, ఉత్సవాల సందర్భంగా బాణసంచా కాల్చడం, వాహన, పారిశ్రామిక కాలుష్యం కారణంగా గాలిలోని నాణ్యత దారుణంగా పడిపోతుంది. గాలి వీచే వేగం తక్కువగా ఉండడం వల్ల కాలుష్య కారకాలు వాతావరణంలోని దిగువ పొరల్లోనే ఉండిపోతాయి.  గాలిలోని విషకణాలు ఊపిరితిత్తుల్లోని కణాల్లోకి సులువుగా చొచ్చుకెళ్తాయి. ఫలితంగా కొవిడ్ సంక్రమణ పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శీతాకాలంలో ఢిల్లీలో రోజుకు 15 వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. గాలి నాణ్యత క్షీణించడం వల్ల రోగుల్లో శ్వాస సంబంధ సమస్యలు పెరిగి లక్షణాలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.