పాక్ అంటే అంతే మరి!.. ఫ్రాన్స్‌లో లేని రాయబారిని వెనక్కి పిలవాలని తీర్మానం!

28-10-2020 Wed 11:45
  • ఫ్రాన్స్ అధ్యక్షుడి తీరుకి నిరసనగా జాతీయ అసెంబ్లీలో తీర్మానం
  • పాక్ రాయబారిని వెనక్కి పిలవాలంటూ ఏకగ్రీవ తీర్మానం
  • విస్తుపోతున్న ప్రపంచం
Pakistan Assembly demands recalling of envoy in France

ప్రపంచ దేశాల ముంగిట పాకిస్థాన్ మరోమారు నవ్వులపాలైంది. అసలు తమ రాయబారే లేని ఫ్రాన్స్ నుంచి ఆయనను వెనక్కి పిలవాలంటూ ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడంపై ప్రపంచం ముక్కున వేలేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మహ్మద్ ప్రవక్త కార్టూన్ల ప్రచురణను సమర్థించడం ద్వారా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇస్లాంపై దాడి చేశారన్న పాక్ ప్రధాని ఇమ్రాన్.. ఆ దేశానికి వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.

మాక్రాన్ వ్యాఖ్యలకు నిరసనగా ఫ్రాన్స్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలవాలన్న తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు ఫ్రాన్స్‌లో తమ రాయబారే లేరన్న విషయాన్ని చట్ట సభ్యులు గాలికి వదిలేయడంపై ప్రపంచం ముక్కున వేలేసుకుంది.

నిజానికి ఫ్రాన్స్‌లో ప్రస్తుతం తమ రాయబారి లేరన్న విషయం ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి తెలిసినా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. ఫ్రాన్స్ లోని తమ రాయబారిని పాక్ మూడు నెలల క్రితమే చైనాకు బదిలీ చేసింది. అప్పటి నుంచీ ఫ్రాన్స్ లో పాక్ రాయబారిని నియమించలేదు.