Dubbaka: ఆ డబ్బుతో మీకు సంబంధం లేకుంటే అరగంటలోనే ఎందుకొచ్చారు?: రఘునందన్‌కు హరీశ్‌రావు సూటి ప్రశ్న

Telangana minister Harish Rao fires on Raghunandan Rao
  • బీజేపీ నేతల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైంది
  • బీజేపీ నేతలు వారి చొక్కాలు వారే చించుకున్నారు
  • కోటి ఉద్యోగాలిస్తామన్న మోదీ ఉన్న ఉద్యోగాలను తొలగించారు
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిన్న తొగుట మండలంలో నిర్వహించిన యువజన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ‌పై విరుచుకుపడ్డారు. ఓ ఇంట్లో దొరికిన నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోతే దుబ్బాకలో ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అరగంటలోనే సిద్దిపేట ఎందుకు వచ్చారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకే తెచ్చారని ఆ ఇంటి యజమానే చెప్పారని, దీంతో బీజేపీ నేతల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైందని ఎద్దేవా చేశారు.

చర్చలకు రావాలంటూ తాను విసిరిన సవాలుతో ఆత్మరక్షణలో పడిపోయిన బీజేపీ నేతలు దాని నుంచి బయటపడేందుకే కొత్త నాటకానికి తెరలేపారన్నారు. బీజేపీ నేతలు వాళ్ల చొక్కాలు వారే చింపుకుని టీఆర్ఎస్ వాళ్లు చింపారని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

తెలంగాణలో నిరుద్యోగం గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. ఆ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లోనే 17 శాతానికి మించి నిరుద్యోగిత ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఏటా కోటి ఉద్యోగాలిస్తామన్న మోదీ సర్కారు నోట్ల రద్దుతో ఉన్న ఉద్యోగాలనే తొలగించిందన్నారు. ముత్యంరెడ్డి మంచోడని చెబుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2018లో ఆయనకు టికెట్ ఎందుకివ్వలేదని హరీశ్ ప్రశ్నించారు.
Dubbaka
TRS
Harish Rao
Raghunandan Rao
Telangana

More Telugu News