కోడికూర వండలేదట.. భార్యను కొట్టి చంపాడు!

28-10-2020 Wed 10:17
  • నాగర్ కర్నూలు జిల్లా క్యాంపు రాయవరంలో ఘటన
  • కర్రతో చితకబాదిన వైనం
  • ఇంట్లో పడేసి తాళం వేసి పరార్
man beaten to death his wife for not cook chicken curry

తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియని ఓ భర్త కోడికూర వండలేదన్న కారణంతో భార్యను కొట్టి చంపాడు. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. క్యాంపు రాయవరం గ్రామానికి చెందిన నిమ్మల సన్నయ్య, సీతమ్మ (38) భార్యాభర్తలు. సోమవారం ఇంటికి కోడిమాంసం తీసుకొచ్చిన సన్నయ్య భార్యకు ఇచ్చి వండి పొలానికి తీసుకురావాలని చెప్పి వెళ్లిపోయాడు. అయితే, దానిని పక్కనపెట్టి కాయగూరలతో వండిన కూరను తీసుకెళ్లింది.

అది చూసిన సన్నయ్య ఆగ్రహంతో ఊగిపోయాడు. కర్రతో భార్యను చితకబాదాడు. దెబ్బలకు తట్టుకోలేని ఆమె స్పృహతప్పి కిందపడిపోయింది. దీంతో భార్యను గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి తీసుకొచ్చి లోపల ఆమెను ఉంచి తాళం వేసి పరారయ్యాడు. గొడవ విషయం తెలిసిన ఇరుగుపొరుగు వారు అనుమానంతో తాళం బద్దలుగొట్టి చూడగా, లోపల సీతమ్మ మృతి చెంది కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.