హైదరాబాద్‌లో డెంటిస్ట్ కిడ్నాప్.. అనంతపురంలో పట్టుకున్న పోలీసులు!

28-10-2020 Wed 09:20
  • నిన్న మధ్యాహ్నం క్లినిక్‌ నుంచే కిడ్నాప్
  • బురఖాలతో వచ్చిన నిందితులు
  • రాప్తాడు సమీపంలో పట్టుకున్న పోలీసులు 
Anantapur police arrested Hyderabad kidnappers

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో నిన్న దంత వైద్యుడు బెహజత్ హుస్సేన్ (57)ను కిడ్నాప్ చేసిన దుండగులను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. మధ్యాహ్నం సమయంలో బురఖా ధరించి క్లినిక్‌లోకి ప్రవేశించిన కిడ్నాపర్లు హుస్సేన్ వ్యక్తిగత సహాయకుడు సయ్యద్ సల్మాన్ (20)ను చితకబాది బాత్రూంలో పడేసి, హుస్సేన్ ను ఆయన కారులోనే కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం కలకలం రేపింది.

వైద్యుడిని బెంగళూరువైపు తీసుకెళ్తుండగా రాప్తాడు సమీపంలో అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. రాత్రి రహదారిపై కాపు కాసిన పోలీసులు కారును ఆపారు. అయితే, ముగ్గురు నిందితులు కారు దిగి పరారవగా, ఒక్కడు మాత్రమే పట్టుబడ్డాడు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. వైద్యుడిని హైదరాబాద్ తరలిస్తున్నారు.