పోలీసు అధికారిని చంపేసిన పందెం కోడి!

27-10-2020 Tue 22:10
  • ఫిలిప్పీన్స్ లో ఘటన
  • ఉత్తర సమర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా పందేలు
  • కోడిపుంజును పట్టుకోబోయిన పోలీసు అధికారి
  • అధికారి తొడలో దిగిన కోడిపుంజు కత్తి
Fighting cock killed Police officer in Philippines

కత్తి కట్టిన కోడిపుంజును బరిలో వదిలితే అది సాగించే పోరాటం అంతాఇంతా కాదు. ఒక్కోసారి కోడిపుంజుకు కట్టే కత్తి పదునుకు వ్యక్తులు కూడా గాయపడుతుంటారు. కోడిపందేలు మన వద్దే కాదు, ఫిలిప్పీన్స్ దేశంలోనూ జోరుగా నిర్వహిస్తారు. అయితే ఫిలిప్పీన్స్ లో ఓ పోలీసు అధికారి దురదృష్టవశాత్తు కోడిపుంజు కత్తికి బలయ్యాడు.

కోడిపందేల బరిపై పోలీసులు దాడి చేయడం మామూలు విషయమే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిలిప్పీన్స్ లో కోడిపందేలపై నిషేధం విధించారు. ఉత్తర సమర్ ప్రాంతంలో కోడిపందేలు జరుగుతుండడంతో స్థానిక శాన్ జోస్ మున్సిపల్ పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్ ఇన్ చార్జిగా పనిచేస్తున్న క్రిస్టియన్ బోలోక్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లాడు. ముగ్గుర్ని అరెస్ట్ చేసి, పందేలు నిర్వహించారన్న దానికి ఆధారంగా రెండు కోడిపుంజులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

అయితే పోలీసు అధికారి బోలోక్ ఆ పుంజులలో ఒకదానిని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే, దాని కాలికి కట్టి ఉన్న పదునైన కత్తి ఆ పోలీసు అధికారి ఎడమ తొడభాగంలోని రక్తనాళాన్ని సర్రున కోసేసింది. దాంతో తీవ్ర రక్తస్త్రావం కావడంతో ఆ పోలీసు అధికారి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన పోలీసు వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ అధికారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.