రాములమ్మ పార్టీ మారుతోందా... కిషన్ రెడ్డితో మంతనాలు అందుకేనా...?

27-10-2020 Tue 21:49
  • ప్రస్తుతం కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా ఉన్న విజయశాంతి
  • కొంతకాలంగా కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరం
  • ఇటీవల కిషన్ రెడ్డితో భేటీ
  • సొంతగూటికి చేరుతోందంటూ ప్రచారం
Vijayasanthi discuss with Kishan Reddy as speculations raised

ప్రముఖ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సంకేతాలు వస్తున్నాయి. ఆమె గతకొంతకాలంగా కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వర్గాలు తీవ్రస్థాయిలో పోరాడుతున్నా విజయశాంతి ఆ దరిదాపుల్లో కనిపించడంలేదు. సోషల్ మీడియాలో ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. ఈ క్రమంలో ఆమె పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అగ్రనేత కిషన్ రెడ్డి... విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ కావడం అందుకు మరింత బలం చేకూర్చుతోంది.

కిషన్ రెడ్డి నుంచి విజయశాంతికి స్పష్టమైన హామీ లభించినట్టు సమాచారం. సరైన సమయం చూసి పార్టీలో చేరతానని విజయశాంతి చెప్పినట్టు తెలుస్తోంది. అదే జరిగితే విజయశాంతి మళ్లీ సొంతగూటికి చేరినట్టవుతుంది. సినిమాల్లో మంచి పొజిషన్ లో ఉన్న సమయంలోనే ఆమె రాజకీయాల్లో ప్రవేశించారు. 1998లో విజయశాంతి బీజేపీలో చేరగా, ఆమెను బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శిగా నియమించారు.

తదనంతర కాలంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో ఆమె బీజేపీ నుంచి బయటికి వచ్చి 'తల్లి తెలంగాణ' పేరిట ప్రత్యేక పార్టీ పెట్టారు. పరిస్థితుల ప్రభావంతో తన పార్టీని టీఆర్ఎస్ లో కలిపేసిన రాములమ్మ... 2009లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి మెదక్ ఎంపీగా గెలిచారు. అయితే కొన్నాళ్లకే టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఆమె 2014లో కాంగ్రెస్ లో చేరారు.

నాటి ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగిన విజయశాంతి ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి రాజకీయ కార్యకలాపాల జోరు తగ్గించారు. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ద్వారా చిత్రసీమలో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు.