ఢిల్లీ బౌలింగ్ ను ఊచకోత కోసిన సాహా, వార్నర్... సన్ రైజర్స్ భారీ స్కోరు

27-10-2020 Tue 21:22
  • దుబాయ్ లో సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ
  • మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్
  • సాహా, వార్నర్ అర్ధసెంచరీలు
  • ఫోర్లు, సిక్సుల వాన
Saha and Warner smashes Delhi bowlers as Sunrisers Hyderabad posted huge total

దుబాయ్ క్రికెట్ స్టేడియంలో పరుగులు వెల్లువెత్తాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్ శివాలెత్తారు. దాంతో ఆ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు వృద్ధి మాన్ సాహా, డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించారు. వేసిన బంతిని వేసినట్టు బాదుతూ స్కోరుబోర్డును వాయువేగంతో దౌడు తీయించారు. రబాడా వంటి ప్రపంచస్థాయి బౌలర్ కూడా ఈ విజృంభణకు ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది.

సాహా 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 87 పరుగులు చేయగా, వార్నర్ 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 66 పరుగులు సాధించాడు. ఈ కుడిఎడమల జోడీని విడదీసేందుకు ఢిల్లీ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తొలి వికెట్ కు 107 పరుగులు జోడించిన అనంతరం వార్నర్... అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. నోర్జే బౌలింగ్ లో సాహా కూడా వెనుదిరగడంతో స్కోరు కాస్త నిదానించింది. చివర్లో మనీశ్ పాండే 31 బంతుల్లో 44 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 200 దాటింది.