భారత్ లో హీరోతో చేయికలిపిన హార్లే డేవిడ్సన్!

27-10-2020 Tue 21:09
  • భాగస్వామిని వెతుక్కున్న హార్లే డేవిడ్సన్
  • హార్లే డేవిడ్సన్ బ్రాండుపై హీరో బైకులు
  • అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్న మోటార్ సైకిల్ దిగ్గజం
Harley Davidson inked a deal with Hero Motocorp

హార్లే డేవిడ్సన్ బైకులంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతకాలం కిందట భారత్ లో ప్రవేశించిన ఈ అమెరికా మోటార్ సైకిల్ దిగ్గజం ఆశించిన స్థాయిలో అమ్మకాలు సాగించలేకపోయింది. దాంతో హర్యానాలోని తన ప్లాంట్ ను మూసేసింది. భారత్ లో తన కార్యకలాపాలకు స్వస్తి పలకనున్నట్టు సెప్టెంబరులో వెల్లడించింది.

ఈ నేపథ్యంలో భారత నెంబర్ వన్ ద్విచక్రవాహన తయారీదారు హీరో మోటోకార్ప్ తో హార్లే డేవిడ్సన్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై ప్రీమియం సెగ్మెంట్లో రెండు బ్రాండ్లు కలిసి విక్రయాలు సాగిస్తాయని హీరో, హార్లే డేవిడ్సన్ వర్గాలు వెల్లడించాయి.

డిస్ట్రిబ్యూషన్ ఒప్పందంలో భాగంగా... హార్లే డేవిడ్సన్ బైకులను హీరో మోటోకార్ప్ విక్రయించడమే కాకుండా విక్రయానంతర సేవలను కూడా అందిస్తుంది. విడిభాగాలను, ఇతర ఉపకరణాలను విక్రయించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న హార్లే డేవిడ్సన్, హీరో డీలర్ల ద్వారా ఈ అధీకృత సేవలు లభ్యమవుతాయి.

లైసెన్సింగ్ ఒప్పందంలో భాగంగా... హీరో మోటోకార్ప్ ప్రీమియం సెగ్మెంట్లో కొత్త బైకులు అభివృద్ధి చేసి హార్లే డేవిడ్సన్ బ్రాండ్ నేమ్ పై విక్రయిస్తుంది.