అఖిలపక్షంతో రేపు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కీలక భేటీ

27-10-2020 Tue 20:53
  • రేపు ఉదయం 10.40 గంటలకు సమావేశం
  • ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తీసుకోనున్న ఈసీ
  • ఎన్నికలను వ్యతిరేకిస్తున్న వైసీపీ
Nimmagadda Ramesh to conduct meeting with all parties

ఏపీలో రేపు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 10.40 నిమిషాలకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభంకానుంది. గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలను ఎన్నికల సంఘం తీసుకోనుంది.

ఈ సమావేశానికి టీడీపీ తరపున అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ నుంచి షేక్ మస్తాన్ వలి, బీజేపీ తరపున పాక సత్యనారాయణ, సీపీఐ నుంచి రామకృష్ణ హాజరవుతున్నట్టు సమాచారం. అయితే వైసీపీ, జనసేన, సీపీఎం నుంచి ఎవరు హాజరవుతారనే దానిపై ఇంకా సమాచారం లేదు. ఎన్నికల నిర్వహణకే మెజార్టీ పార్టీలు మొగ్గు చూపుతుండగా... అధికార వైసీపీ మాత్రం వ్యతిరేకిస్తోంది.