నవంబరు 30 వరకు అన్ లాక్ 5.0 మార్గదర్శకాలే!

27-10-2020 Tue 20:48
  • దేశంలో కొనసాగుతున్న అన్ లాక్ 5.0 ప్రక్రియ
  • గత మార్గదర్శకాల్లో మార్పులేవీ లేవన్న కేంద్రం
  • కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠిన నిబంధనలు
Center extended Unlock guidelines for a month

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి. అయితే, ఇవే మార్గదర్శకాలు నవంబరు 30 వరకు కొనసాగుతాయని కేంద్రం తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో 50 శాతం ప్రేక్షకులనే అనుమతించాల్సి ఉంటుందని పేర్కొంది.

అంతకుముందు, అన్ లాక్ 5.0 ప్రక్రియ అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు తెరుచుకోవచ్చని ఈ మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, గత మార్గదర్శకాల్లో మార్పులేవీ లేవని, ఇవే మరో నెల పాటు అమల్లో ఉంటాయని కేంద్రం తన తాజా ప్రకటనలో తెలిపింది.

ఎప్పట్లాగానే అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేయొచ్చని, సరకు రవాణా చేసుకోవచ్చని వివరించింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠిన నిబంధనలు తప్పవని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణాలకు కేంద్రం అనుమతి తప్పనిసరి అని, స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు తెరిచే అంశం రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే వదిలేస్తున్నామని వెల్లడించింది.