గత 20 గంటలుగా బండి సంజయ్ దీక్ష... క్రమంగా తగ్గుతున్న షుగర్ లెవల్స్!

27-10-2020 Tue 18:37
  • కరీంనగర్ లో సంజయ్ దీక్ష
  • సొమ్మసిల్లి అస్వస్థతకు గురైన తెలంగాణ బీజేపీ చీఫ్
  • సిద్ధిపేట సీపీని బదిలీ చేసేంతవరకు దీక్ష ఆపబోనని ఉద్ఘాటన
Bandi Sanjay continues his protest in Karimnagar party office

పోలీసుల వైఖరికి నిరసనగా, సిద్ధిపేట సీపీని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. నిన్న రాత్రి జరిగిన అరెస్ట్ సందర్భంగా సిద్ధిపేట సీపీ జోయెల్ డేవిస్ తనపై చేయిచేసుకున్నారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. కాగా, ఆయన కరీంనగర్ లో చేపట్టిన దీక్ష గత 20 గంటలుగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో బండి సంజయ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన షుగర్ లెవల్స్ క్రమంగా పడిపోతున్నట్టు వైద్యులు గుర్తించారు. సంజయ్ సొమ్మసిల్లి స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వైద్యులు ఆయనను రెండోసారి పరీక్షించారు. సంజయ్ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. కాగా, సీపీని బదిలీ చేసి కేసు నమోదు చేసేవరకు కార్యాలయంలోనే దీక్ష కొనసాగిస్తానని సంజయ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కండువా కప్పుకున్న కార్యకర్త తరహాలో సీపీ వైఖరి ఉందని వ్యాఖ్యానించారు.