మోదీకి కూడా 9 మంది తోడపుట్టినవాళ్లు ఉన్నారు: నితీశ్ వ్యాఖ్యలకు తేజశ్వి కౌంటర్

27-10-2020 Tue 18:32
  • కొడుకు కోసం వరుసగా పిల్లల్ని కన్నారంటూ లాలూ దంపతులపై నితీశ్ విమర్శ
  • మహిళల మనోభావాలను దెబ్బతీశారన్న తేజశ్వి
  • అలసిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని వ్యాఖ్య
PM Has 6 Siblings says Tejashwi Yadav after Nitish Kumar remarks on his parents

కొడుకు కావాలనే తపనతో ఎనిమిది నుంచి తొమ్మిది మంది పిల్లలను కన్నారంటూ లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిలను ఉద్దేశించి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తేజశ్వి యాదవ్ అదే స్థాయిలో స్పందించారు. లాలూ దంపతులకు తొమ్మిది మంది సంతానం కాగా... ఏడుగురు కూతుళ్ల తర్వాత తేజశ్వి, తేజ్ ప్రతాప్ యాదవ్ జన్మించారు. దీన్ని ఉద్దేశించే నితీశ్ కుమార్ విమర్శించారు. కూతుళ్లపై లాలూ దంపతులకు అభిమానం లేదని... కొడుకు కోసం పిల్లలను కంటూనే పోయారని అన్నారు. వీళ్లు తయారు చేయాలనుకుంటున్న బీహార్ ఇలాగే ఉంటుందని విమర్శించారు.

నితీశ్ వ్యాఖ్యలపై తేజశ్వి యాదవ్ స్పందిస్తూ, నితీశ్ కుమార్ విమర్శలు కూడా తనకు ఆశీస్సుల వంటివేనని చెప్పారు. మహిళలు, తన తల్లి మనోభావాలను నితీశ్ దెబ్బతీశారని అన్నారు. తన వ్యాఖ్యలతో ప్రధాని మోదీని కూడా నితీశ్ విమర్శించారని చెప్పారు. మోదీకి కూడా ఆరుగురు సోదరసోదరీమణులు ఉన్నారని చెప్పారు. ఆకాశాన్నంటుతున్న ధరలు, అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యల గురించి నితీశ్ మాట్లాడరని... ఇలాంటి వాటి గురించే మాట్లాడతారని అన్నారు.

తన గురించి నితీశ్ వాడుతున్న చెడు పదాలు కూడా తనకు మంచే చేస్తాయని తేజశ్వి చెప్పారు. మానసికంగా, శారీరకంగా నితీశ్ అలిసిపోయారని... అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీహార్ ప్రజలు ఈసారి అభివృద్ది, ఉపాధి కల్పనకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.