Khushboo: నన్ను అరెస్ట్ చేశారు.. బయట ఏం జరుగుతోందో కూడా అర్థం కావడం లేదు: ఖుష్బూ

  • మనుస్మృతిని రద్దు చేయాలన్న తిరుమవలవన్
  • నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఖుష్బూ
  • చెంగల్పట్టు జిల్లాలో అరెస్ట్ చేసిన పోలీసులు
Khushbu Detained During Protest Amid Manusmriti Remarks Row

మహిళలను కించిపరిచేలా ఉన్న భారతీయ పురాతన హిందూ గ్రంథం మనుస్మృతిని నిషేధించాలంటూ కడలూర్ ఎంపీ, వీసీకే పార్టీ అధినేత తిరుమవలవన్ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలియజేయడానికి వెళ్తున్న సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూని పోలీసులు అడ్డుకున్నారు. చెంగల్పట్టు జిల్లాలో ఆమెను అరెస్ట్ చేశారు. కడలూరులో ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిరసన కార్యక్రమం చేపట్టేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ఖుష్బూ ఓ జాతీయ మీడియాతో ఫోన్ లో మాట్లాడుతూ, తనను చెంగల్పట్టు జిల్లా ప్రారంభంలోనే అరెస్ట్ చేశారని చెప్పారు. తనది అరెస్టా లేక నిర్బంధమా? అని పోలీసులను అడిగితే... అరెస్టేనని చెప్పారు. ఇతర పార్టీ నేతలతో కలిపి తనను ఒక ప్రైవేట్ స్థలంలో ఉంచారని తెలిపారు. బయట ఏం జరుగుతోందో కూడా తమకు అర్థం కావడం లేదని చెప్పారు. తమను బయటకు పంపడం లేదని, బయట నుంచి లోపలకు ఎవరినీ పంపడం లేదని అన్నారు.

17వ శతాబ్దంలో రాసిన మనుస్మృతి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం తిరుమవలవన్ కు ఏమొచ్చిందని ఖుష్బూ ప్రశ్నించారు. త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలాంటి వాటి గురించి మాట్లాడటం అవసరమా? అని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన సిగ్గుపడాలని చెప్పారు.

More Telugu News