లండన్ థియేటర్ ఆర్టిస్టును పెళ్లాడనున్న ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే

27-10-2020 Tue 15:19
  • రెండో పెళ్లి చేసుకుంటున్న హరీశ్ సాల్వే
  • కరోలిన్ బ్రొసార్డ్ తో ప్రేమలో పడిన న్యాయ దిగ్గజం
  • మొదటి భార్య మీనాక్షికి విడాకులు
Harish Salve will marry London theater artist

హరీశ్ సాల్వే... భారత న్యాయవాద దిగ్గజం. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో భారత సొలిసిటర్ జనరల్ గా విధులు నిర్వర్తించిన ఆయన, కుల్ భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో సమర్థంగా వాదనలు వినిపించి భారత్ కు అనుకూల తీర్పు రావడంలో కీలక భూమిక పోషించారు. ఈ కేసులో వాదించేందుకు ఆయన తీసుకున్న ఫీజు ఒక్క రూపాయి మాత్రమే.

అయితే, 65 ఏళ్ల హరీశ్ సాల్వే ఇప్పుడు మరోవిధంగా వార్తల్లోకెక్కారు. ఆయన ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. హరీశ్ సాల్వేకి గతంలో మీనాక్షితో వివాహం జరిగింది. వీరికి సాక్షి, సానియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొన్న జూన్ నెలలో హరీశ్ సాల్వే... మీనాక్షికి విడాకులు ఇచ్చారు. ఆయన ఈ ఏడాది ఆరంభంలో బ్రిటన్ క్వీన్స్ కౌన్సెల్ గా నియమితులవడంతో లండన్ వెళ్లిపోయారు.

అక్కడే ఆయనకు కరోలిన్ బ్రొసార్డ్ అనే థియేటర్ ఆర్టిస్టుతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఓ కళా ప్రదర్శనలో ఇద్దరూ తొలిసారిగా కలిశారు. కరోలిన్ వయసు 56 ఏళ్లు కాగా, ఆమెకు ఓ కుమార్తె ఉంది. ఇప్పటికే మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసిన సాల్వే.. త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు స్వయంగా ప్రకటించారు. రేపు లండన్ లోని ఓ చర్చిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరగనుంది.