ట్రాక్టర్ ను దించేసినట్టు టీడీపీని కూడా దించేస్తాడు: లోకేశ్ పై కొడాలి నాని సెటైర్లు

27-10-2020 Tue 14:58
  • పార్టీని నడపడం రాదు.. ట్రాక్టర్ ను నడపడం కూడా రాదు
  • లోకేశ్ ది హాఫ్ నాలెడ్జి
  • ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్టే
Nara Lokesh is half knowledge person says Kodali Nani

వరద బాధితులను టీడీపీ నేత నారా లోకేశ్ పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా అకివీడు ప్రాంతంలో నిన్న ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపారు. అయితే అదుపు తప్పిన ట్రాక్టర్ పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కన ఉన్న టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్ ను కంట్రోల్ చేశారు. లోకేశ్ ను ట్రాక్టర్ నుంచి కిందకు దింపేశారు. దీంతో, అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో లోకేశ్ పై మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వరదలు ఎప్పుడు వచ్చాయి? ఈయన ఎప్పుడు పరామర్శిస్తున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుందని అన్నారు. లోకేశ్ ది ఆఫ్ నాలెడ్జ్ అని అన్నారు. పార్టీని నడపడం రాదని... ట్రాక్టర్ నడపడం కూడా రాదని విమర్శించారు. కొల్లేటిలోకి ట్రాక్టర్ ను ఎలా దించాడో తెలుగుదేశం పార్టీని కూడా అలాగే దించేస్తాడని అన్నారు. లోకేశ్ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా వేస్ట్ అని చెప్పారు.

మరోవైపు లోకేశ్ పై పోలీసులు పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. డ్రైవింగ్ పై అవగాహన లేకుండా వరద ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమయ్యారని కేసు పెట్టారు. కరోనా నిబంధనలు పాటించలేదని మరో కేసు పెట్టారు.