Ravi Shankar Prasad: మీ తల్లిదండ్రుల ఫొటోలంటే ఎందుకు సిగ్గుపడుతున్నావు?: తేజశ్వికి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్న

Why So Ashamed Of Your Parents Photo asks Ravi Shankar Prasad to Tejashwi Yadav
  • 'కొత్త బీహార్' పోస్టర్లపై మీ తల్లిదండ్రుల ఫొటోలు ఎక్కడ?
  • ఆ ఫొటోలు చూస్తే అప్పటి కిడ్నాపులు వీరికి గుర్తొస్తాయి  
  • తేజశ్వి అధికారంలోకి వస్తే మళ్లీ కిడ్నాపులు మొదలవుతాయి
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో నాయకుల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు ఎక్కువవుతున్నాయి. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'కొత్త బీహార్' నినాదంతో ఏర్పాటు చేసిన ఎన్నికల పోస్టర్లపై మీ తల్లిదండ్రులు రబ్రీదేవి, లాలూ ప్రసాద్ యాదవ్ ల ఫొటోలను ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేసిన వారిద్దరి ఫొటోలను పెట్టడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావని అన్నారు. పూర్ణియాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తర్వాత దీనికి కారణం కూడా ఆయనే చెప్పారు. 'బీహార్ కు తేజశ్వి యాదవ్ తల్లిదండ్రులు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రులుగా పని చేశారు. అలాంటి వారి ఫొటోలను పోస్టర్ల మీద పెట్టలేదు. వీరిద్దరి ఫొటోలను చూస్తే పూర్ణియా ప్రజలకు గతంలో జరిగిన కిడ్నాపులు గుర్తుకొస్తాయి. ఆ భయాలతో ఈ ప్రాంతాన్ని వదిలి ఎందుకు తాము వెళ్లిపోయిందీ వారికి గుర్తొస్తుంది. అందుకే వారి ఫొటోలు పెట్టడానికి పాపం తేజశ్వి  సిగ్గుపడుతున్నాడు. ఎన్డీయే అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది... అదే తేజశ్వి అధికారంలోకి వస్తే కనుక మళ్లీ కిడ్నాపులు ప్రారంభమవుతాయి' అన్నారు రవిశంకర్ ప్రసాద్.
Ravi Shankar Prasad
BJP
Tejashvi Yadav
RJD

More Telugu News