సోనూసూద్ సాయం పట్ల నెటిజన్ అనుమానాలు.. సవివరంగా సమాధానం ఇచ్చిన సోను!

27-10-2020 Tue 13:23
  • ట్విట్టర్ ద్వారా సాయం కోరిన రోగికి సోనూ సాయం
  • రోగి ట్విట్టర్ ఖాతా ఫేక్ అంటూ నెటిజన్ ట్వీట్
  • అటువంటి వ్యక్తికి సాయం చేస్తున్నానని సోనూ చెబుతున్నాడని వ్యాఖ్య
  • నిజంగానే సాయం చేస్తున్నానని నిరూపించుకున్న సోనూ
netizen tweets sonusood

పేదలకు సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటోన్న సోనూసూద్‌ తీరుపై ఓ నెటిజన్ అనుమానాలు వ్యక్తం చేశాడు. ఇటీవల సోనూసూద్‌కి ఓ వ్యక్తి ట్వీట్ చేసి సాయం కావాలని కోరాడు. దీంతో సోనూసూద్ సాయం చేశానని ప్రకటించాడు. అయితే, ట్వీట్ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు ఏవీ ఆయన చేసిన ట్వీట్‌లో లేవు. దీన్ని గుర్తించిన ఓ నెటిజన్ సోనూసూద్‌ చేస్తోన్న సాయంపై అనుమానం వ్యక్తం చేశాడు.

సాయం అడిగిన వ్యక్తిది కొత్త ట్విట్టర్ అకౌంట్ అని, కేవలం ఇద్దరు ఫాలోవర్లు ఉన్నారని చెప్పాడు. తన వైద్యానికి సహాయం చేయాలంటూ ఒకే ఒక ట్వీట్ చేశాడని అన్నారు. అందులోనూ కనీసం సోనూను ట్యాగ్ కూడా చేయలేదని, తన లొకేషన్ చెప్పలేదని అన్నాడు. చిరునామా, ఈ మెయిల్ అడ్రస్ వంటివి ఏవీ ఇవ్వలేదని తెలిపాడు. అయినప్పటికీ ఆ ట్వీట్‌కు సోనూ ఎలా స్పందించాడని, ఇదెలా సాధ్యమో తెలియడం లేదని చెప్పాడు.

అంతేగాక, గతంలో సోనూని సాయం కోరుతూ ట్విట్టర్ హాండిల్స్ నుంచి వచ్చిన ట్వీట్లు ఇప్పుడు కనపడట్లేవని చెప్పాడు. దీనిపై సోనూసూద్ స్పందించాడు.  అదే గొప్ప విషయమని అన్నాడు. ఇబ్బందుల్లో ఉన్న వారిని తాను గుర్తిస్తానని, అలాగే, కష్టాల్లో ఉన్న వారు తనను ఆశ్రయిస్తారని చెప్పాడు. ఈ విషయం  చిత్తశుద్ధికి సంబంధించినదని, అలాంటివి నీకు అర్థం కావంటూ రిప్లై ఇచ్చాడు. తనకు ట్వీట్ చేసి సాయం పొందుతున్న ఈ రోగి రేపు ఎస్ఆర్‌సీసీ ఆసుపత్రిలో ఉంటాడని, సాయం చేయాలనిపిస్తే చేయాలని నెటిజన్ కు చెప్పాడు. ఆ రోగికి సంబంధించిన వివరాలను కూడా సోనూసూద్ షేర్ చేసి నెటిజన్‌కు వచ్చిన అనుమానాలు తీర్చాడు.