మామా అల్లుళ్ల కుట్రలు పని చేయవు: బాబూమోహన్

27-10-2020 Tue 12:30
  • దుబ్బాకను కేసీఆర్ అసలు పట్టించుకోలేదు
  • గజ్వేల్, సిద్దిపేట ఎలా ఉన్నాయి? దుబ్బాక ఎలా ఉంది?
  • మోదీ కన్నెర్ర చేస్తే కేసీఆర్ జైల్లో ఉంటారు
KCR has done nothing to Dubbaka says Babu Mohan

దుబ్బాక ఉపఎన్నిక ప్రచార పర్వం రసవత్తరంగా సాగుతోంది. పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేయడంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, ఏబీవీపీ, బీజేవైఎం నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నారు.

నిరాహారదీక్ష చేపట్టిన బండి సంజయ్ ను బీజేపీ నేతలు డీకే అరుణ, బాబూమోహన్ పరామర్శించారు. అరగంట సేపు ఆయనతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాబూమోహన్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

దుబ్బాకను కేసీఆర్ అసలు పట్టించుకోలేదని బాబూమోహన్ విమర్శించారు. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, హరీశ్ రావు నియోజకవర్గం సిద్దిపేట ఎలా ఉన్నాయి? దుబ్బాక ఎలా ఉందని ప్రశ్నించారు. తమ అభ్యర్థి రఘునందన్ రావుపై కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ కన్నెర్ర చేస్తే కేసీఆర్ జైల్లో ఉంటారని అన్నారు. మామా అల్లుళ్లు చేసే కుట్రలు పని చేయవని చెప్పారు. మరోవైపు బండి సంజయ్, రఘునందర్ రావుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీసినట్టు సమాచారం.