త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ హీరోగా సినిమా?

27-10-2020 Tue 12:30
  • ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా 
  • 'ఆర్ఆర్ఆర్' వల్ల ఈ ప్రాజక్ట్ ఆలస్యం  
  • గ్యాప్ లో రామ్ తో సెట్ చేసిన త్రివిక్రమ్
  • స్క్రిప్ట్ రెడీ.. త్వరలో అధికారిక ప్రకటన    
Trivikram Srinivas to direct Ram

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఓ చిత్రం చేయనున్నాడన్నది టాలీవుడ్ తాజా వార్త. ఇటీవలే కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ 'రెడ్' సినిమాలో నటించాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ ఇప్పుడు రామ్ కి వచ్చినట్టుగా చెబుతున్నారు.

వాస్తవానికి 'అల వైకుంఠపురములో' చిత్రం తర్వాత త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయాల్సివుంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పని కూడా పూర్తయింది. 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ని కూడా దీనికి వర్కింగ్ టైటిల్ గా అనుకున్నారు. అయితే, గత కొంతకాలంగా ఎన్టీఆర్ నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఇంకా పూర్తికాలేదు. అనుకున్న సమయం కన్నా ఇది ఇంకా ఎక్కువ పట్టేలా వుంది.

ఈ నేపథ్యంలో ఖాళీగా ఉండడం ఎందుకని భావించిన త్రివిక్రమ్ ఈ గ్యాప్ లో రామ్ తో చిత్రాన్ని సెట్ చేసినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పని కూడా పూర్తయిందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.