శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా 'పెళ్లిసందడి'.. అధికారిక ప్రకటన!

27-10-2020 Tue 09:20
  • 1996లో వచ్చిన హిట్ 'పెళ్లిసందడి'కి రీమేక్  
  • నాటి హీరో శ్రీకాంత్, ఊహల తనయుడు నేటి హీరో 
  • కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ
  • దర్శకత్వం గౌరి రోణంకి.. సంగీతం కీరవాణి    
Roshan to play lead role in Pellisandadi

1996లో వచ్చిన 'పెళ్లిసందడి' సినిమా తెలుగునాట థియేటర్లలో ఎంతటి సందడి చేసిందో మనకు తెలుసు. శ్రీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు రూపొందించిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.

ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రాన్ని మళ్లీ అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. విశేషం ఏమిటంటే, ఇందులో హీరోగా నాటి 'పెళ్లిసందడి' హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

 శ్రీకాంత్, ఊహ దంపతుల తనయుడు రోషన్ ఆమధ్య నాగార్జున నిర్మించిన 'నిర్మలా కాన్వెంట్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. అయితే, అది ఎటూ కాని వయసు కావడంతో ఆ తర్వాత గ్యాప్ తీసుకుని, నటనలో సంపూర్ణమైన శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా 'పెళ్లిసందడి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  

ఆర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలసి ప్రముఖ నిర్మాత కె.కృష్ణమోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించనున్నారు. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.