పోలీసుల ఆంక్షలు బేఖాతరు.. దేవరగట్టులో కొనసాగిన కర్రల సమరం!

27-10-2020 Tue 07:18
  • కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసుల విశ్వప్రయత్నాలు
  • పోలీసుల కళ్లుగప్పి కొండల మార్గం ద్వారా దేవరగట్టు చేరుకున్న భక్తులు
  • కర్రల సమరంలో 50 మంది భక్తులకు గాయాలు
Devaragattu bunny festival held amid tensions

బన్ని ఉత్సవాలను పోలీసులు నిషేధించినప్పటికీ భక్తులు మాత్రం ఏమాత్రం బెరుకు లేకుండా దేవరగట్టు చేరుకుని కర్రల సమరంలో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో బన్ని ఉత్సవాలను పోలీసులు నిషేధించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఈసారి ఉత్సవాలు జరుగుతాయా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది.

అయితే, ఆంక్షలను పక్కనపెట్టిన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట, సుళువాయి గ్రామాల ప్రజలు దేవరగట్టుకు చేరుకుని కర్రల సమరంలో పాల్గొన్నారు. నిజానికి కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. 30 చెక్ పోస్టులు, 50 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ భక్తులు వెరవకుండా కొండల మార్గం ద్వారా తరలివచ్చి బన్ని యాత్రలో పాల్గొన్నారు.

నిన్న రాత్రి పదిన్నర వరకు ఎలాంటి హడావుడి లేక బోసిపోయినట్టు కనిపించిన తేరు బజారు ప్రాంతం ఒక్కసారిగా జనంతో కిక్కిరిసిపోయింది. అర్చకులు స్వామి వారికి కల్యాణం నిర్వహించి ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి కిందికి తీసుకొచ్చి సింహాసన కట్ట వద్ద ఉంచారు.

అక్కడి నుంచి విగ్రహాలకు భక్తులు కర్రలు అడ్డుగాపెట్టి రాక్షసపడ వద్దకు తీసుకెళ్లారు. విగ్రహాలను చేజిక్కించుకునేందుకు జరిగిన కర్రల సమరంలో దాదాపు 50 మంది గాయపడగా, వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.