నాయిని కుటుంబంలో మరో విషాదం.. భార్య అహల్య కన్నుమూత

27-10-2020 Tue 06:24
  • కరోనాతో ఇటీవలే కన్నుమూసిన నాయిని
  • ఐదు రోజుల వ్యవధిలోనే ఆయన భార్య కూడా
  • ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌కు చికిత్స పొందుతున్న అహల్య
Nayini Ahalya passes away

ఇటీవల కన్నుమూసిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కుటుంబంలో మరో విషాదం నెలకొంది. నాయిని మృతి చెంది ఐదు రోజులైనా గడవకముందే ఆయన భార్య అహల్య కూడా కన్నుమూశారు. ఆమె వయసు 68 సంవత్సరాలు. కరోనా బారినపడిన అహల్య (68) ఇటీవల కోలుకున్నట్టే కనిపించారు. పరీక్షల్లో ఆమెకు కరోనా నెగటివ్ కూడా వచ్చింది. అయితే, ఆ తరువాత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది.

హైదరాబాదు, జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. నాయిని మృతి సమయంలో ఆఖరి చూపు చూసేందుకు కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్సులో తీసుకెళ్లారు. వారం రోజులు కూడా గడవకముందే భార్యాభర్తలు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో నాయిని కుటుంబంలో విషాదం నెలకొంది.