కోల్ కతా భారీ స్కోరు ఆశలు ఆవిరి... అద్భుతంగా కట్టడి చేసిన పంజాబ్ బౌలర్లు

26-10-2020 Mon 21:40
  • షార్జాలో పంజాబ్ వర్సెస్ కోల్ కతా
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసిన కోల్ కతా
  • షమీకి 3 వికెట్లు
  • జోర్డాన్, బిష్ణోయ్ లకు చెరో 2 వికెట్లు
KXIP Bowlers restrict Kolkata batsmen for a normal score

షార్జాలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఓ దశలో 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోల్ కతా జట్టు... ఆపై ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సులు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సులు) చలవతో కోలుకుంది. వీరిద్దరూ బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో భారీ స్కోరు దిశగా పయనిస్తున్నట్టు అనిపించింది. ఈ జోడీ నాలుగో వికెట్ కు 81 పరుగులు జోడించింది.

అయితే పంజాబ్ బౌలర్లు వ్యూహం మార్చి బౌలింగ్ చేయడంతో కోల్ కతా టపటపా వికెట్లు కోల్పోయింది. మోర్గాన్, గిల్ అవుటయ్యాక చివర్లో లాకీ ఫెర్గుసన్ (13 బంతుల్లో 24 నాటౌట్) మినహా మరెవ్వరూ రాణించలేదు. పంజాబ్ బౌలర్లలో షమీ 3, క్రిస్ జోర్డాన్ 2, రవి బిష్ణోయ్ 2, మ్యాక్స్ వెల్ 1, మురుగన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.