'సుల్తాన్'గా వస్తున్న కార్తీ.. ఫస్ట్ లుక్ ఇదిగో!

26-10-2020 Mon 21:02
  • తెలుగులో కూడా మార్కెట్ తెచ్చుకున్న కార్తీ
  • బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో 'సుల్తాన్'
  • రష్మిక నటిస్తున్న తొలి తమిళ సినిమా
  • ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న 'సుల్తాన్'   
Karthis Sultan first look out

ప్రముఖ హీరో సూర్య తమ్ముడిగా వెండితెరకు పరిచయమైనా కార్తీ హీరోగా తనకంటూ ఓ పత్యేకతను సంపాదించుకున్నాడు. విభిన్న కథా చిత్రాలు చేస్తూ తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఒక ఇమేజ్ ను, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. మొదటి నుంచీ తెలుగు మీద కూడ దృష్టి పెట్టడంతో ఇక్కడ కూడా అతని సినిమాలకు మార్కెట్ ఏర్పడింది. ఇటీవల నటించిన 'ఖైదీ' సినిమా కూడా అతనికి తమిళ, తెలుగు భాషల్లో మంచి పేరుతెచ్చిపెట్టింది.

ఇక కార్తీ చేస్తున్న తాజా చిత్రం పేరు 'సుల్తాన్'. తెలుగు, తమిళ భాషల్లో ఇదే టైటిల్ నిర్ణయించారు. 'రెమో' ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ రష్మిక కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన ఈ లుక్ లో కార్తీ ఫుల్ సీరియస్ గా కనిపిస్తున్నాడు. విలన్ల భరతం పట్టడానికి వచ్చిన వాడిలా రౌద్రాన్ని ప్రదర్శిస్తున్నాడు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, 'మీరు చూపించే ప్రేమాభిమానాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.. సుల్తాన్ ఫస్ట్ లుక్ ఇదిగో.. మీకు ఇది నచ్చుతుందని ఆశిస్తున్నా' అంటూ కార్తీ అభిమానులకు ఓ సందేశాన్ని కూడ పెట్టాడు. రష్మిక తొలిసారిగా తమిళంలో నటించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది.