శామీర్ పేటలో అదృశ్యమైన బాలుడి మృతదేహం ఔటర్ రింగ్ రోడ్ పక్కన లభ్యం

26-10-2020 Mon 14:55
  • శామీర్‌పేటలో అదృశ్యమైన అతియాన్ 
  • ఆ బాలుడు ఉంటోన్న ఇంట్లోనే అద్దెకు బీహార్ వాసి సుదర్శన్ శర్మ
  • షేర్ చాట్ వీడియో తీసుకునేందుకు ఇద్దరూ యత్నం
  • ప్రమాదవశాత్తూ పడిపోయిన బాలుడు
  • భయంతో మృతదేహాన్ని తీసుకెళ్లి పడేసిన శర్మ
boy deadbody found at ring road

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లో ఇటీవల ఓ బాలుడు అదృశ్యం కావడం కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శామీర్‌పేట్ ఔటర్‌ రింగ్‌రోడ్ పక్కన ఓ బాలుడి మృతదేహం గుర్తించారు. ఆఖరికి అది శామీర్‌పేటలో అదృశ్యమైన అతియాన్(5)దిగా నిర్ధారించారు. బాలుడి మృతి కేసులో ఓ అనుమానితుడిని విచారించిన పోలీసులు పలు విషయాలను గుర్తించారు.

ఆ బాలుడు ఉంటోన్న ఇంట్లోనే బీహార్ వాసి సుదర్శన్ శర్మ అద్దెకు ఉంటున్నాడని, అతడితో కలిసి షేర్ చాట్ వీడియో తీసుకునేందుకు సుదర్శన్ శర్మ ప్రయత్నించాడని, ఆ సమయంలో బాలుడు ప్రమాదవశాత్తూ భవనం పై నుంచి కిందపడి, మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. దీంతో భయంతో ఆ మృతదేహాన్ని ఔటర్ రింగ్ రోడ్ పక్కన పడేశాడని సుదర్శన్ శర్మ పోలీసులకు తెలిపారు. సుదర్శన్ శర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నారు.