ప్రభుత్వసాయం అటుంచితే నాయకులు, అధికారులు కనీసం పలకరించిన పాపాన పోలేదు: లోకేశ్

26-10-2020 Mon 14:39
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన
  • శృంగవరప్పాడు వరద బాధితులకు పరామర్శ
  • కళ్లు చెమర్చాయన్న లోకేశ్
Nara Lokesh visits flood effected villages

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వరద ముంపు ప్రాంతాల్లో తన పర్యటన కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన కొల్లేరు సరస్సు ముంపుకు గురైన శృంగవరప్పాడు గ్రామస్తులను కలుసుకున్నారు. వరద బాధితులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రత్యక్షంగా అక్కడి పరిస్థితులు చూసిన ఆయన ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామం అంతటా మోకాలి లోతు నీళ్లు ఉన్నాయని, నిత్యావసర వస్తువులు కూడా అందని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.

గ్రామస్తులకు ప్రభుత్వసాయం అటుంచితే, కనీసం నాయకులు, అధికారులు వచ్చి ఇంతవరకు పలకరించిన పాపాన పోలేదని లోకేశ్ విమర్శించారు. ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి వైద్య సదుపాయాలు లేక విషజ్వరాలతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు ఆవేదనతో చెబుతుంటే కళ్లు చెమర్చాయని అన్నారు.