నా తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ప్రార్థించండి: హీరోయిన్ చార్మి

26-10-2020 Mon 13:58
  • నా తల్లిదండ్రులకు కరోనా సోకింది
  • ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు
  • ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వచ్చింది
  • లక్షణాలుంటే త్వరగా పరీక్షలు చేయించుకోండి
charmme parents test positive for corona

హీరోయిన్ చార్మి తల్లిదండ్రులకు కరోనా సోకడంతో వారు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ చార్మి ఓ పోస్ట్ చేసింది. కరోనా నుంచి తప్పించుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తన తల్లిదండ్రులు దాని బారినపడ్డారని తెలిపింది.

ఈ నెల ‌ 22న తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, గత మార్చి నుంచి వారు హైదరాబాద్‌లోని తమ నివాసంలోనే ఉంటున్నారని చెప్పింది. ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ వారికి కరోనా సోకిందని తెలిపింది. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి తనకు తెలుసనీ, ఈ పరిస్థితుల్లో ఆయనకు కరోనా సోకిందన్న వార్త వినగానే భయమేసిందని చెప్పింది.  

చికిత్స నిమిత్తం వాళ్లిద్దరూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారని చెప్పింది. వారిద్దరు ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపింది. ఎవరికైనా కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపిస్తే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని, ప్రారంభ దశలోనే గుర్తించి నిర్మూలిస్తే ఎలాంటి నష్టం జరగదని చెప్పింది.  

ఆ దుర్గాదేవి మన చుట్టూ ఉన్న చెడుని తొలగించాలని ఆమె కోరుకుంది. మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నానని పోస్ట్ చేసింది. తన తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాల్సిందిగా కోరుతున్నానని చెప్పింది.