పవన్ కల్యాణ్ సినిమాకి అన్నయ్య టైటిల్?

26-10-2020 Mon 13:45
  • 1982లో వచ్చిన చిరంజీవి సినిమా 'బిల్లా రంగా' 
  • బిల్లాగా చిరంజీవి, రంగాగా మోహన్ బాబు
  • 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో పవన్  
  • బిల్లా పాత్రలో పవన్, రంగా పాత్రలో రానా     
Chiranjivis film title for Pawans film

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో మోహన్ బాబుతో కలసి చేసిన సినిమా 'బిల్లా రంగా'. 1982లో విడుదలైన ఈ చిత్రంలో బిల్లాగా చిరంజీవి, రంగాగా మోహన్ బాబు నటించారు. ఇప్పుడీ చిత్రం ప్రస్తావన ఎందుకంటే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడీ టైటిల్ తో ఓ చిత్రం చేయనున్నట్టు తెలుస్తోంది.

మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రం తెలుగు రీమేక్ లో పవన్ కల్యాణ్ నటిస్తున్నట్టుగా నిన్న విజయదశమి రోజున అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇందులో మరో కీలక పాత్రను రానా దగ్గుబాటి పోషిస్తున్నాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఇప్పుడీ చిత్రానికి 'బిల్లా రంగా' అనే టైటిల్ని నిర్ణయించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఇందులో పవన్ కల్యాణ్ బిల్లా పాత్రలోనూ, రానా రంగా పాత్రలోనూ కనిపిస్తారట. దాంతో దీనికి పవన్ తన అన్నయ్య పాత సినిమా టైటిల్ 'బిల్లా రంగా'ను నిర్ణయించే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.