కరోనా వ్యాక్సిన్ ప్రకటనపై దిద్దుబాటు చర్యల్లో కేంద్ర ప్రభుత్వం

26-10-2020 Mon 09:42
  • బీహార్ మేనిఫెస్టోలో ఫ్రీ వ్యాక్సిన్ ను చేర్చిన బీజేపీ
  • ఇతర రాష్ట్రాలకు ఇవ్వరా? అంటూ విపక్షాల మండిపాటు
  • దేశ ప్రజలందరికీ ఇస్తామన్న ప్రతాప్ సారంగి
All Citizens In Country Will Get Free COVID 19 Vaccine says Union Minister

బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చిన ఒక హామీ దేశ వ్యాప్తంగా విమర్శలను మూటకట్టుకుంది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ తెలిపింది. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఇతర రాష్ట్రాల ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించాయి. ఎన్నికలు ఉంటే తప్ప ప్రజలకు ఏమీ చేయరా? అంటూ విరుచుకుపడ్డాయి. కరోనా మహమ్మారిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల ప్రజలు బంగ్లాదేశ్ నుంచి వచ్చారా? అని మండిపడ్డారు.

దీంతో, దిద్దుబాటు చర్యలకు కేంద్ర ప్రభుత్వం దిగింది. కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి మాట్లాడుతూ, దేశ ప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ ను ఇస్తామని చెప్పారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని అన్నారు. ఒక్కో వ్యాక్సిన్ కు రూ. 500 వరకు ఖర్చవుతుందని... ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని చెప్పారు. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.