టాలీవుడ్‌లో ప్రారంభమైన మరో నిర్మాణ సంస్థ

26-10-2020 Mon 08:56
  • సొంత సంస్థను ప్రారంభించిన వాశిలి శ్యామ్ ప్రసాద్
  • సప్త స్వర క్రియేషన్స్ పేరుతో బ్యానర్
  • ఇంటిల్లిపాది చూసే సినిమాలను నిర్మిస్తామని వ్యాఖ్య
Vasili Shyam Prasad starts his own Production

టాలీవుడ్ లో మరో నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో పని చేస్తూ వచ్చిన వాశిలి శ్యామ్ ప్రసాద్ తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. సప్త స్వర క్రియేషన్స్ పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, చెడుపై మంచి విజయం సాధించిన దసరా రోజున తమ బ్యానర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు కోలుకుంటున్న వేళ నిర్మాణ సంస్థను ప్రారంభించామని తెలిపారు. ఇంటిల్లిపాది చూసే చిత్రాలు, యూత్ ని అట్రాక్ట్ చేసే ప్రేమకథా చిత్రాలను అందించాలనేదే తమ సంస్థ లక్ష్యమని చెప్పారు.

ఏడాదికి నాలుగు సినిమాలను నిర్మించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని తెలిపారు. టాలెంట్ ఉన్న నటీనటులకు, టెక్నీషియన్లకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. తాము చేపట్టబోతున్న ప్రాజెక్టుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. మరోవైపు శ్యామ్ ప్రసాద్ కు పలువురు సినీ ప్రముఖులు తమ అభినందనలను తెలియజేశారు.