మూఢభక్తి.. ఒకరు నాలుక కోసుకుంటే, మరొకరు గొంతు కోసుకున్నారు

26-10-2020 Mon 08:53
  • ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటనలు
  • దేవుడికి నాలుకను నైవేద్యంగా పెట్టిన భక్తుడు
  • శివాలయంలో గొంతు కోసుకున్న మరో భక్తుడు
A devotee cut his tongue for God

దసరా పండుగనాడు ఉత్తరప్రదేశ్ లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. బాబేరు ప్రాంతంలోని భాటి అనే గ్రామంలోని ఆలయంలో 22 ఏళ్ల యువకుడు తన నాలుకను కోసుకున్నాడు. దాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించాడు.

 తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ ఘటనపై సదరు యువకుడి తండ్రి మాట్లాడుతూ, తన కుమారుడి మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు. నవరాత్రి సందర్భంగా నాలుక కోసుకున్నాడని తెలిపారు.

ఉత్తరప్రదేశ్ లోనే నిన్న ఇలాంటిదే మరో ఘటన జరిగింది. కురారా ప్రాంతంలోని కోకేశ్వర్ శివాలయంలో 49 ఏళ్ల రుక్మిణి మిశ్రా అనే వ్యక్తి కత్తితో గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మూఢనమ్మకాలతో ఇలాంటి పనులు చేయవద్దని కోరారు.