Uddhav Thackeray: చెప్పుకోవడానికి ఏమీ లేక విమర్శలు చేస్తున్నారు: ఉద్ధవ్ పై బీజేపీ ఫైర్

  • 11 నెలల కావస్తున్నా ఉద్ధవ్ చేసిందేమీ లేదు
  • హిందుత్వ విషయంలో కూడా రాజీ పడ్డారు
  • రైతులకు కేవలం రూ. 10 వేల కోట్లతో ప్యాకేజీ ఇచ్చారు
Uddhav Thackeray done nothing to Maharashtra says BJP

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే విషయం అందరికీ తెలిసిందే. అవసరాలను బట్టి పార్టీలు, నాయకులు తమ స్టాండ్ ను మార్చుకుంటుంటారు. మహారాష్ట్రలో ఇప్పుడు అదే జరుగుతోంది.

దశాబ్దాలుగా అన్నదమ్ముల మాదిరి ఉన్న బీజేపీ, శివసేన... సిద్ధాంతాలను పక్కన పెట్టి రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకుంటున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత... ఆ పార్టీని ఏదో విధంగా ఇరుకున పెట్టే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తూనే ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా శివసేనపై విమర్శల దాడి చేస్తూనే ఉంది.

తాజాగా శివసేన, సీఎం ఉద్ధవ్ పై బీజేపీ మరోసారి విమర్శనాస్త్రాలను సంధించింది. అధికారం చేపట్టి 11 నెలలు కావస్తున్నా... రాష్ట్రానికి ఉద్ధవ్ చేసింది ఏమీ లేదని బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్ అన్నారు. అధికారం కోసం హిందుత్వ వాదం విషయంలో కూడా శివసేన రాజీ పడిందని ఆయన మండిపడ్డారు. శివసేన దసరా వార్షికోత్సవ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సావర్కర్ ను కాంగ్రెస్ పార్టీ తిడుతున్నా శివసేన మౌనంగా ఉంటోందని అన్నారు. రైతులను ఎగతాళి చేసేలా కేవలం రూ. 10 వేల కోట్లతో ప్యాకేజీని ఇచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీఎస్టీ ప్యాకేజీపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదని విమర్శించారు. చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో... బీజేపీపై, కేంద్రంపై శివసేన విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.

More Telugu News