Rajasthan: సెంచరీతో చెలరేగిన స్టోక్స్.. భారీ విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన రాజస్థాన్

  • 196 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించిన రాజస్థాన్
  • బౌలర్లపై విరుచుకుపడిన బెన్ స్టోక్స్, శాంసన్
  • ఐదు విజయాలతో రాజస్థాన్ ఖాతాలో 10 పాయింట్లు
rajasthan has won against mumbai indians

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అలవోకగా విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 10 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది.

రాబిన్ ఉతప్ప (13), స్టీవ్ స్మిత్ (11) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరినప్పటికీ బెన్ స్టోక్స్, సంజు శాంసన్ కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. స్టోక్స్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయ సెంచరీ (107) చేశాడు. మరోవైపు సంజు శాంసన్ కూడా ముంబై బౌలర్ల భరతం పట్టాడు. 31 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి 18.2 ఓవర్లలోనే జట్టును విజయ తీరాలకు చేర్చారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ 37, సూర్యకుమార్ యాదవ్ 40, సౌరభ్ తివారీ 34 పరుగులు చేయగా, చివర్లో హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. వేసిన బంతులను వేసినట్టే స్టాండ్స్‌లోకి తరలించాడు. 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పాండ్యా 2 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 60 పరుగులు చేశాడు.

అజేయ సెంచరీతో రాజస్థాన్‌కు అపురూప విజయాన్ని అందించిన స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో రాజస్థాన్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేనప్పటికీ ముంబై ఇండియన్స్‌ను ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టకుండా ప్రస్తుతానికి అడ్డుకుంది. రాజస్థాన్‌కు ఇది ఐదో విజయం కాగా, ముంబైకి ఇది నాలుగో ఓటమి. నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా జట్ల మధ్య షార్జాలో ఐపీఎల్‌ 46వ మ్యాచ్ జరగనుంది.

More Telugu News