Amaravati: అట్రాసిటీ కేసును వెనక్కి తీసుకోలేమన్న పోలీసులు.. మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

Tension at Mangaligiri police station
  • అమరావతిలో మూడు రాజధానులకు అనుకూలంగా స్థానిక ఎస్సీల దీక్షలు
  • వారిని అడ్డుకున్న మరికొందరు ఎస్సీలు, బీసీలు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే మొన్న (23న) అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాలెంకు చెందిన కొందరు ఎస్సీలను అదే ప్రాంతానికి చెందిన కొందరు ఎస్సీలు, బీసీలు అడ్డగించారు. రాజధాని కోసం భూములిచ్చిన తామంతా రోడ్డున పడితే... మీరు మూడు రాజధానుల కోసం దీక్షలు చేస్తున్నారని... ఇది ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఈ క్రమంలో వీరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. అనంతరం కొందరు ఎస్సీలు కృష్ణాయపాలెంకు చెందిన 11 మంది ఎస్సీ, బీసీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

అయితే ఆ తర్వాత కేసును వెనక్కి తీసుకునేందుకు వారు సమ్మతించినా... పోలీసులు మాత్రం తిరస్కరించారు. ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని  పోలీసులు స్పష్టం చేస్తారు. దీంతో ఎస్సీ సంఘాల నేతలు, టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. కనీస విచారణ కూడా జరపకుండానే ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన డీఎస్పీ దుర్గాప్రసాద్ వాహనాన్ని చుట్టుముట్టారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద ఆందోళనకు దిగారు.
Amaravati
Mangalagiri
Police

More Telugu News