కరోనా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఫడ్నవిస్ కు ఇప్పుడు అర్థమై ఉంటుంది: సంజయ్ రౌత్

25-10-2020 Sun 20:29
  • కరోనా బారిన పడినట్టు ప్రకటించిన ఫడ్నవిస్..
  • దేవుడు విరామాన్ని ఇచ్చారని ప్రకటన..
  • థాకరేపై వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రౌత్..
Fadnavis now understands how serious the corona condition is Sanjay Routh

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కరోనా బారిన పడ్డారు. లాక్ డౌన్ సమయం నుంచి తాను ప్రతి రోజు పని చేస్తున్నానని... ఇప్పుడు భగవంతుడు తనకు కొంత విరామాన్ని ఇచ్చాడని చెప్పారు. తనకు కరోనా సోకిందని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రకటించిన వెంటనే... నెటిజన్లు ఆయనపై సెటైర్ల దాడి మొదలు పెట్టారు. గోమూత్రం తాగాలని, పతంజలి కోర్నిల్ ట్యాబ్లెట్లు వాడాలని, వదిన చేసిన అప్పడాలు తినాలని ఇలా రకరకాల సూచనలు ఇస్తూ కామెడీ చేస్తున్నారు.

మరోవైపు ఫడ్నవిస్ కరోనా బారిన పడటంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. బయట కరోనా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఫడ్నవిస్ కు ఇప్పుడు అర్థమై ఉంటుందని అన్నారు. కరోనా బారిన పడిన ఫడ్నవిస్ కు అత్యుత్తమ చికిత్స అందేలా ముఖ్యమంత్రి థాకరే చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కరోనాకు భయపడి థాకరే ఇంటి నుంచి కూడా బయటకు రావడం లేదంటూ ఇటీవలే ఫడ్నవిస్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.