సరిహద్దులో ఉద్రిక్తతలు ముగిసిపోవాలని ప్రార్థించా: శస్త్ర పూజ తర్వాత రాజ్ నాథ్ సింగ్

25-10-2020 Sun 15:24
  • డార్జిలింగ్ లోని సుక్నా వార్ మెమోరియల్ వద్ద ఆయుధ పూజ
  • ఆయుధాలు, ఆయుధాలు ధరించిన వాహనాలకు పూజ
  • సైనికుల ధైర్యసాహసాలను చరిత్ర గుర్తుంచుకుంటుందని వ్యాఖ్య
Want tension at border to end says Rajnath Singh

సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు ముగిసిపోవాలని ప్రార్థించానని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈరోజు ఆయన సిక్కిం వద్ద ఉన్న చైనా బోర్డర్ లో ఆయుధ పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ఉన్నారు. డార్జిలింగ్ లోని సుక్నా వార్ మెమోరియల్ వద్ద పలువురు ఆర్మీ అధికారులు, జవాన్లతో కలిసి వీరు పూజను నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశాన్ని రక్షించడం కోసం మన సైనికులు ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. ఇండో-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గిపోవాలని, శాంతి నెలకొనాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. కానీ, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయని అన్నారు. మన భూభాగాన్ని ఒక్క ఇంచు కూడా ఎవరూ తీసుకోకుండా మన సైనికులు కాపాడుకోగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. మన సైనికుల ధైర్యసాహసాలను చరిత్ర గుర్తుంచుకుంటుందని చెప్పారు.

మరో వైపు పూజ సందర్భంగా పలు ఆయుధాలను, ఆయుధాలు కలిగిన వాహనాలకు రాజ్ నాథ్ పూజ నిర్వహించారు. సంస్కృతంలో ప్రార్థనలను నిర్వహించారు.